Sunday, August 12, 2012

మా ప్రణామం

మణిమయ  మకుట విరాజిత సీత
మౌన నదీనద నిలయసమేత
గగనానికి ఎగసిన సద్గుణచరిత
ఘనత వహించిన  జాతిసమైక్యత

ఏ దేశం వెళ్ళినా
నా దేహం భారతం
ఏ పీఠం ఎక్కినా
నా ధ్యేయం నీ హితం


 
విశ్వమే ప్రేమతో నిండనీ
విజయమే దీక్షతో పొందనీ

' మా'  ఇదే ప్రణామం
'మా'   ఇదే ప్రణామం  



( రహమాన్ వందేమాతరం ప్రేరణతో.....)            ...శైలు....

Thursday, April 12, 2012

ఘటన

మనిషి కధకు వుందా ముందు
మనోవ్యధకు లేదా మందు
మనసిచ్చి కోసేదెవరు
మమత పెంచి తుంచేదెవరు
తెలియాలని ఎందుకు తపన
తెలియకుంటే అంతా ఘటన

మనసు - మననం

మనసనే పలకపైన
రాస్తూ చెరుపుతున్నా
చెరుపుతూ రాస్తున్నా
అనుభవాల అనుభూతుల్ని
ఫ్రతి అనుభవం ఒక పాఠంలా
మరల మరల మననం చేస్తున్నా
మరుపన్నది సహజమని
కాలం పెట్టిన పరీక్షలో
గెలుస్తూ ఓడుతున్నా
ఓడుతూ గెలుస్తున్నా
ప్రతి ఓటమి ఓ గెలుపుకి
నాంది అనుకుంటూ
పడుతూ లేస్తున్నా
లేస్తు పడుతున్నా
కాళ్ళు నడవనంటున్నా
మెట్లెక్కుతూనే వున్నా
విజయానికి ఇంకా
అయిదేమెట్లనుకుంటూ
ఆఖరి మెట్టెక్కేక గానీ
అర్ధం కాలేదు ఆ మెట్లు
అందలానికి కాదు
కిందకి దిగేందుకని
మళ్ళీ ఆరోహణ , అవరోహణ
వెతుకులాట... వెంపర్లాట

జీవగడ్డ

సిరులు పొంగే జీవగడ్డే
కరవు బారెను పడెనురా
ఆదరించిన అన్నపూర్ణ
దేవిరించెను నేడురా
అన్నదమ్ముల మెలగు జాతుల
అంత కలహములొచ్చెరా
ఉమ్మడి కుటుంబాలూడి
వూరుమ్మడి బ్రతుకులాయెరా
వుండి లేనట్టాయెరా
తెలుగు ప్రజలకు తెగులుసోకి
తెగలు తెగలై పోయెరా
పొరుగుపచ్చను ఓర్వలేక
పొగిలి పొగిలి ఏడ్చెరా
వృద్ధశరణాలయమ్ము చూస్తే
అర్ధమవదా లోకతీరు
అర్ధ మే పరమార్ధమాయె
అనుబంధమన్నది దాటె ఏరు.

Wednesday, April 11, 2012

ఆలోచనలు..

అర్ధం లేని ఆలోచనలు
అనవరతం అల్లాడిస్తున్నాయి
అటు పోవు, ఇటు పోవు
కటువుగ కాటేస్తున్నాయి
ఇవేమిటీ ఆలోచనలు
ఈగల్లా ముసురుతున్నాయి
వద్దన్నా వినవు, రావద్దన్నా మానవు
పొద్దున్నే నిద్రలేపి ,సిద్ధం అంటున్నాయి...
మనిషి కధకు వుందా ముందు
మనోవ్యధకు లేదా మందు
మనసిచ్చి కోసేదెవరు
మమత పెంచి తుంచేదెవరు
అయోమయం ఆదీఅంతం
అంధకారమేనా సత్యం
కాలానికి కావలి ఎవరు
కలని ఇలని కలిపేదెవరు

Monday, January 30, 2012

వుండాలోయ్ యువహృదయానికి






ఆత్మవిశ్వాసం , ఆత్మాభిమానం
ఎదిరించే శౌర్యం , ఎరుకపరచే స్థైర్యం
వుండాలోయ్ యువహృదయానికి
ఆశయమే గురిగా, సాహసమే సిరిగా
సత్యమే ఊపిరిగా, అహింసయే ఆయుధంగా
వుండాలోయ్ యువహృదయానికి

మానవత, మమత, సమత సమపాళ్ళగా
సాధన, శోధన, ఆవేదన జతగాళ్ళుగా
వుండాలోయ్ యువహృదయానికి
 

చినుకులు © 2008. Template Design By: SkinCorner